Ranabali | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. తాజాగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ‘రణబాలి’లో హింసాత్మక సన్నివేశాలను కొంతమేర తగ్గించినట్లు రాహుల్ సంకృత్యాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా పూర్తయిన తర్వాత కొన్ని టెస్ట్ స్క్రీనింగ్స్ నిర్వహించామని, ప్రేక్షకుల స్పందనను గమనించిన అనంతరం కొన్ని హింసాత్మక సన్నివేశాలను తగ్గించాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
కథకు అవసరమైన సీన్స్ కొనసాగిస్తూనే.. ప్రేక్షకులకు సినిమా మరింత సహజంగా, అందుబాటులో ఉండేలా ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ‘రణబాలి’లోని బ్రిటిష్ పాత్రలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు వెల్లడించారు. సినిమాలో బ్రిటిష్ పాత్రలు ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడతాయని రాహుల్ తెలిపారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వారి మాటలకు తెలుగు ఓవర్ల్యాప్ను ఉపయోగించామని చెప్పారు. కథలో పెద్దగా ప్రాధాన్యం లేని సాధారణ సంభాషణలు ఉన్న చోట్ల బ్రిటిష్ పాత్రలు మాట్లాడే ఇంగ్లీష్ డైలాగులను అలాగే ఉంచినట్లు వివరించారు.
సినిమాలో పాత్రలు ఏ భాషలో మాట్లాడాలి అనే విషయంలో కృత్రిమతకు తావివ్వకుండా సహజత్వానికి పెద్దపీట వేశామని రాహుల్ సంకృత్యాన్ చెప్పుకొచ్చారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో విదేశీ పాత్రలు కనిపించినప్పుడు ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెలుగులో చూపిస్తుంటారు. అయితే ‘రణబాలి’లో అలాంటి ప్రయత్నం చేయకుండా.. పాత్రల నేపథ్యానికి తగ్గట్టుగానే వారి భాషను ఉంచాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. ఇలాంటి విధానాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అనుసరించిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆ సినిమాలో బ్రిటిష్ పాత్రలైన స్కాట్, జెన్నిఫర్ తదితరులు ప్రధానంగా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వారితో తెలుగు మాట్లాడించేందుకు కృత్రిమమైన డైలాగులను పెట్టకుండా.. వారి పాత్రలకు సహజంగా అనిపించే భాషలోనే సంభాషణలు రాసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఈ విధానం బాగా పనిచేసింది. బ్రిటిష్ పాత్రలు నిజంగానే ఆ కాలానికి చెందినవారిగా, తమ నేపథ్యానికి తగ్గట్టుగా మాట్లాడుతున్న భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఇప్పుడు అదే తరహా సహజత్వాన్ని ‘రణనబాలి’లోనూ తీసుకురావడానికి రాహుల్ సంకృత్యాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.