నటీనటులు: అల్లరి నరేష్, సురభి, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రాశిసింగ్, ప్రిషాసింగ్, విష్ణుప్రియ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి
కళ: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
విడుదల తేదీ: 04-09-2026
అల్లరి నరేశ్ మళ్లీ కామెడీ జానర్లో చేసిన ప్రయత్నం ‘రంభ ఊర్వశి మేనక’. ఆ మధ్య సీరియస్ కథలతో ముందుకెళ్లిన అల్లరి నరేశ్ తన పాత జానర్లోకి వచ్చి ఈ సినిమా చేయడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. పైగా హాస్య మూవీస్ వంటి సంస్థ నిర్మించిన సినిమా కావడం. దానికితోడు ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ అందరి అంచనాలనూ అందుకున్నదా? అల్లరి నరేశ్ మళ్లీ కామెడీతో విజయం సాధించాడా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి..
కథ
మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి(అల్లరి నరేశ్), అతని కుటుంబం ‘రంభ ఊర్వశి మేనక’ పేరుతో ఓ డ్రామా కంపెనీ నడుపుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. వారి దగ్గర ఓ మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్‌పై సరిగ్గా ముగ్గు గీస్తే స్వర్గం నుంచి రంభ ఊర్వశి మేనక దిగొచ్చి కోర్కెలు తీరుస్తారని ఓ నమ్మకం. ఆ బుక్ వల్ల సూరి కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. సినిమా హీరో కావాలనేది సూరి కల. కానీ అందుకు తగ్గ ప్రయత్నాలేవీ చేయడు. ఆ బుక్ పేరు చెప్పి అప్పులు చేస్తుంటాడు. చివరకు ఈ బుక్ కారణంగా ఆ కుటుంబానికి పుట్టెడు అప్పులే మిగులుతాయి. ఈ బాధలోనే అతని తల్లి మంచం పడుతుంది. ఆమెను బతికించుకోవాలంటే లక్షలతో పని. దాంతో సూరి ఏం చేయాలో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆ దిక్కుతోచని స్థితిలోనే ఆ మ్యాజిక్ బుక్‌ని తీసి, దానిపై ముగ్గు గీస్తాడు. అంతే.. బుక్ ఓపెన్ అవుతుంది. నిజంగా స్వర్గం నుంచి రంభ ఊర్వశి మేనక దిగొస్తారు. మరి ఆ దేవతామూర్తులు సూరి కోర్కెలన్నీ తీర్చారా? హీరో కావాలనే సూరి కోర్కె నెరవేరిందా? లేక కొత్త కష్టాలు వచ్చాయా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ
విశ్లేషణ
రొటీన్ రొడ్డకొట్టుడు కామెడీ సినిమా ఇది. గతంలో ఇలాంటి ఫాంటసీ సినిమాలు చాలా వచ్చాయి. సినిమా ఆద్యంతం స్ఫూఫ్‌లు, ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ట్రెండ్ అయిన అంశాలు.. వీటన్నింటినీ రంగరించి దర్శకుడు సీన్స్ రాసుకున్నాడు. కథ, కథనం, కామెడీ.. ఇవన్నీ పాత పద్ధతిలోనే ఉంటాయి తప్ప ఏక్కడా కొత్తదనం అనేదే ఈ సినిమాలో కనిపించదు. సిట్యువేషన్ కామెడీ అనేది ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపిస్తుంది కానీ, డైలాగ్ కామెడీ, క్రింజ్ కామెడీ ఆడియన్స్‌కి అంతగా అలరించదు. దర్శకుడు ఈ సినిమా విషయంలో డైలాగ్ కామెడీనే ఎక్కువ ఉపయోగించాడు. హాలీవుడ్ ఒడిస్సీ సినిమా. ఏపీ భోగాపురం ఎయిర్పోర్ట్, ఓజీ సినిమా, ఏపీ రాజధాని అమరావతి.. ఇలా ట్రెండ్‌లో ఉన్న ప్రతి అంశం డైలాగులుగా ఈ సినిమాలో వినిపిస్తుంటాయి. అయితే.. అల్లరి నరేశ్, వీకే నరేశ్, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి.. ఇలా రాటుదేలిన నటులు ఉండటం వల్ల సినిమా కాస్త నిలబడిందని చెప్పాలి. వారి వల్ల సినిమాలో అక్కడక్కడా నవ్వులు పండాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం సినిమా ఫర్లేదనిపించింది. రంభ ఊర్వశి మేనకలతో అల్లరి నరేశ్ సీన్స్ ఆడియన్స్‌ని అలరిస్తాయి. పతాక సన్నివేశం బావుంది.
నటీనటులు
అల్లరి నరేశ్ ఎప్పటిలాగే కామెడీని చక్కగా పండిచారు. ఇక వీకే నరేశ్ గురించి చెప్పేదేముంది. స్వతహాగా గొప్ప నటుడు. పాత్ర ఎంతవరకూ న్యాయం చేయాలో అంతవరకూ చేశారు. ఇక మిగతా నటీనటులంతా పరిధి మేర పాత్రల్ని రక్తికట్టించారు. రంభ ఊర్వశి మేనకల గ్లామర్ సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టింది.
సాంకేతికంగా
కథ పాతదే. కథనంలో కొత్తదనం లేదు. అయితే.. పాటలు, నేపథ్య సంగీతంతోపాటు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నందు సవిరిగాన మాటలు, ఆయన డైలాగుల్లో పంచ్‌లు అక్కడక్కడ బాగా పేలాయి. కథను దర్శకుడు బాగానే తీశాడు కానీ, వచ్చిన సమస్యల్లా కథ, కథనంలో కొత్తదనం లేదు. కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ రంభ ఊర్వశి మేనక నచ్చొచ్చు..
బలాలు
నటీనటుల నటన, కెమెరా, నేపథ్య సంగీతం, మాటలు
బలహీనతలు
కథ, కథనం
రేటింగ్ 2.5/5