Ramabanam Movie Review | లక్ష్యం నిర్ధేశించుకోకుండా వదిలిన బాణాన్ని గురితప్పింది అనడం కూడా సరియైనది కాదు..అందుకే గోపీచంద్ రామబాణం చిత్రం గురితప్పింది అనడం కంటే అసలు ఈ సినిమా చేయడానికి ముందు దర్శకుడు, హీరోకు తప్పకుండా ఓ విజయాన్ని సాధించాలి అనే లక్ష్యం పెట్టుకోకుండా కేవలం కాంబినేషన్‌ను నమ్ముకుని, మన కలయికలో ఏ కథతో సినిమా చేసిన ప్రేక్షకులు చూస్తారులే అనే అతివిశ్వాసం కనిపించింది. లక్ష్యం, లౌక్యం సినిమాల విజయాలతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్-శ్రీవాస్‌లు ఓ మూసకథ, పాతకథతో రామబాణం పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే మనం 1990 సంవత్సరంలో వున్నామా? లేక 2023లో వున్నామా? పాతకథ తీసుకున్నా.. అందరికి తెలిసిన కథ తీసుకున్నా కనీసం ఆ కుటుంబ భావోద్వేగాల్లో మినిమమ్ ఎమోషన్స్ అయినా కనిపించాలి కదా.. సినిమా మొత్తంలో కొత్తగా చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా తీసుకోకపోవడం నిజంగా ఓ సినిమా తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం, గట్స్ కావాలి.. ఈ సినిమా చూస్తుంటే శ్రీవాస్లో మాత్రం అవి మెండుగా కనిపించాయి. ఈ దర్శకుడు మునుపటి సినిమా సాక్ష్యంలో పంచభూతల నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా కథ బాగుంది.. కానీ ఆడలేదు అనే మాటలు వినిపించాయి. ఈ సినిమా విషయంలో శ్రీవాస్ తప్పులేదనే అనుకున్నారు చాలా మంది. రామబాణం విషయంలో మాత్రం శ్రీవాస్‌ను విమర్శించకుండా వుండలేరేమో.. భూపతిరాజా అందించిన అవుడ్డేటేడ్ మూసకథతో శ్రీవాస్ ఇలాంటి సినిమాను అందించడం తప్పకుండా ఈ ఫెయిల్యూర్ మేజర్ క్రెడిట్ అతని మీద వేసుకోవాల్సిందే… అసలు ఇంతకి ఆ పాతకథ ఎలా వుందో తెలుసుకుందాం…
కథ:
రఘుదేవపురం అనే గ్రామంలో రాజారాం (జగపతిబాబు), అతని తమ్ముడు విక్కి (గోపీచంద్) ఆర్గానిక్ హోటల్ నడుపుతుంటాడు. రాజారాం నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు, ఎదైనా చట్టప్రకారం వెళ్లాలి అని కోరుకునే మనస్తత్వం వున్న వ్యక్తి, విక్కిది చిన్నప్పటి నుంచే దూకుడు స్వభావం, ఇద్దరికి వచ్చిన అభిప్రాయ భేదాలతో చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోతాడు విక్కీ. కోల్‌కత్తాకు వెళ్లి డాన్ ఎదిగిన విక్కి అక్కడే భైరవి (డింపుల్ హయతి) ప్రేమలో పడతాడు. ఓ కారణంతో 14 సంవత్సరాల తరువాత విక్కి అన్న దగ్గరకు వస్తాడు. కానీ పారిశ్రామిక వేత్త జీకే (తరుణ్ ఆరోరా) కారణంగా అన్నకి సమస్యలతో పాటు ప్రాణహాని వుందని తెలుసుకుంటాడు. దీంతో వీక్కి అన్నను ఈ ప్రాబ్లెమ్ నుంచి ఎలా కాపాడాడు? సమస్యలను ఎలా పరిష్కరించాడు? విక్కీ డాన్‌గా ఎదిగాడు అని తెలిసిన తరువాత రాజారాం ఎలా రియాక్టయ్యాడు అనేది అసలు కథ? ఈ విషయాలన్నీ తెలియాలంటే రామబాణం చూడాలి అని నేను రికమండ్ చేయను కానీ అది మీ ఇష్టం.
విశ్లేషణ:
ఇప్పటి వరకు ఈ కథతో మనం ఎన్నో సినిమాలు చూసి వుంటాం అనే భావన సినిమా చూస్తున్నంత సేపు కలుగుతుంది. కథతో పాటు ట్రీట్మెంట్ కూడా పూర్తి రోటిన్ ఫార్ములానే నమ్ముకోవడంతో ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా అనిపించదు. రెగ్యులర్ సినిమాల్లో కూడా పాటలు, ఫైట్స్‌లు షరామామూలే. వెన్నెల కిషోర్, అలీ, ఎంటర్టైన్మెంట్ రొటిన్కా బాప్లా వుంటుంది. ఈసినిమాలో ప్రేక్షకులకు ఏమైనా రిలీఫ్ వుందంటే అది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. ఫస్టాఫ్ తరువాత సెకండాఫ్ కూడా అంతే రోటిన్‌గా సాగుతుంది. రెండున్నర గంటల సినిమాలో ఎక్కడ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు చిత్ర బృందం
నటీనటుల పనితీరు:
గోపీచంద్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆకట్టుకున్నాడు. గతంలో ఇలాంటి పాత్రలు చేసిన గోపీచంద్‌కు విక్కి పాత్ర పోషించడం పెద్ద కష్టమేమీ కాదు. నటుడిగా తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. గత కొన్ని సినిమాల్లో విలన్‌గా చూస్తున్న జగపతిబాబును మళ్లీ పాజిటివ్ పాత్రలో చూపించారు. ఆయనను నటుడిగా దర్శకుడు పూర్తిస్తాయిలో వాడుకోలేదేమో అనిపించింది. అయితే జగపతిబాబు పవర్ఫుల్ విలనిజం పాత్రలే కంటిన్యూ చేయడం బెటర్ అనిపించింది. భైరవిగా డింపుల్ హయతి పాత్రకు పెద్ద స్కోప్ లేదు. కుష్బూ తన పాత్రలో ఆకట్టుకున్నారు.
ఫైనల్‌గా:
మూసకథతో, ఎలాంటి కొత్తదనం లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కష్టమనే చెప్పాలి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించని సినిమా ఇది. టోటల్‌గా రామబాణం లక్ష్యం లేకుండా వదిలిన బాణంలా వుంది..!
రేటింగ్: 2/5