రామ్ పోతినేని నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో రియల్‌లైఫ్ సూపర్‌స్టార్‌గా నటించారు. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒకరోజు ముందుగానే అంటే.. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఓ అభిమాని బయోపిక్‌గా తెరకెక్కిన సినిమా ఇదని, వేలాది అభిమానుల జీవితాలను ప్రతిబింబించే ఈ సినిమా ఆడియన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ తెలిపారు. భారతీయ సినీ చరిత్రలోనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ఇదని, ఈ నెల 18న కర్నూల్లో భారీ పబ్లిక్ ఈవెంట్‌ని నిర్వహించనున్నామని నిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ నుని, సంగీతం: వివేక్, మెర్విన్.