Ram Charan In Pushpa-2 | మోస్ట్ అవేయిటెడ్ ఇండియన్ మూవీస్‌లో పుష్ప-2 ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.350కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు పుష్ప-2 సెట్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా సోమవారం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. పుష్ప సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది క్షణాల్లోనే వైరల్ అవుతుంది. కాగా తాజాగా పుష్ప-2లో రామ్‌చరణ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో వీళ్ళ కాంబోలో ఎవడు అనే సినిమా వచ్చింది. కానీ వీరిద్ధరు కలిసి కనిపించిన సన్నివేశాలు లేవు. ఇక ఇటీవలే అల్లు అరవింద్ కూడా బన్నీ,చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపాడు. అంతేకాకుండా ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్‌ను పదేళ్ల ముందే రిజిస్టర్ చేసినట్లు తెలిపాడు. మరి ఇప్పుడు మెగా అభిమానుల కల పుష్ప-2తో తీరుతుందా? లేదా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.