Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పెద్ది పోస్ట్‌పోన్ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదట మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా, తర్వాత ఏప్రిల్ 30కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ జూన్‌కు పోస్ట్‌పోన్ అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా స్పందిస్తూ ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చరణ్, ‘పెద్ది లేట్ అవడం లేదని కొంచెం ప్రమోట్ చేయండి.. వాయిదా అని బయట బాగా వింటున్నాను’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో సినిమా మరోసారి వాయిదా పడదనే క్లారిటీ వచ్చేసింది.
ఇక అదే ప్రమోషనల్ వీడియోలో ‘రాకాస’ టీమ్‌తో చరణ్ చేసిన సరదా కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. నిహారిక మాట్లాడుతూ షూటింగ్ కోసం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని, కానీ ప్రమోషన్స్ కోసం 60 రోజులు సమయం కేటాయించారని చెప్పగా, చరణ్ ‘RRR 2 తీస్తున్నారా?’ అంటూ ఫన్నీగా స్పందించారు.‘రాకాస’ సినిమాపై కూడా చరణ్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియానా జోన్స్ లెవల్లో ఈ సినిమా తీసారు, స్నేక్ డ్యాన్స్ సీక్వెన్స్ చాలా బాగుంది’ అంటూ కొనియాడారు. పరీక్షలు పూర్తయ్యాయని, ఇది క్లీన్ సమ్మర్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు శర్మ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రత్నవేలు నిర్వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయి. మొత్తానికి ‘పెద్ది’పై వస్తున్న రూమర్స్‌కు రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ఏప్రిల్ 30 విడుదలపై నిలిచింది.