Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మళ్లీ తన స్టార్ ట్యాగ్ మార్చుకున్నారు. అభిమానులు, సినీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతెరపై రామ్ చరణ్‌కి ఉన్న పేరు ‘మెగా పవర్ స్టార్’ . ఇది ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్యాగ్స్‌తో పెట్టారు. కానీ “RRR” తర్వాత రామ్ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో ఆయనను అభిమానులు “గ్లోబల్ స్టార్” అని సంబోధించడం ప్రారంభించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్‌తో సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో, చెర్రీ పేరుకి ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ అధికారికంగా వాడబడింది.
అయితే, తాజాగా విడుదలైన ‘పెద్ది’ సినిమాలో మాత్రం రామ్ చరణ్‌కి మళ్లీ పాత ట్యాగ్‌నే వాడారు. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విషయం స్పష్టమైంది. పోస్టర్‌పై ‘గ్లోబల్ స్టార్’ బదులుగా మళ్లీ ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ అని మెన్షన్ చేశారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు “గేమ్ ఛేంజర్ ఫలితం ప్రభావమేనా?” అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు “ఎన్ని పేర్లు మారినా, ఆయన మా మెగా పవర్ స్టార్‌గానే ఉంటారు” అంటూ చెర్రీకి మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ ట్యాగ్ మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అంచనాలకు విరుద్ధంగా ఘోర పరాజయాన్ని చవిచూసి, 2025లోనే కాదు టాలీవుడ్ చరిత్రలో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. నిర్మాతలకు భారీ నష్టాలు తలపెట్టింది. ఈ ఫలితంతో రామ్ చరణ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. ‘గ్లోబల్ స్టార్’ అని ట్యాగ్ పెట్టుకున్న హీరోకు ఇలా ఫలితం రావడం ఏమిటని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇక మెగా అభిమానులు కూడా కాస్త సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ ఇప్పుడు తన పాత ట్యాగ్ “మెగా పవర్ స్టార్” తో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అతని కొత్త సినిమా ‘పెద్ది’ పోస్టర్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆగస్టు చివర్లో విడుదలైన సాంగ్ షూటింగ్ అప్డేట్ పోస్టర్లో “గ్లోబల్ స్టార్ రామ్ చరణ్” అని ఉన్నా, ఇప్పుడు రిలీజ్ చేసిన ‘పెద్ది’ పోస్టర్లలో మాత్రం “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” అని ఉండడం చర్చనీయాంశం అయింది.