కొన్ని కాంబినేషన్లు అనుకుంటేనే అభిమానుల్లో వైబ్రేషన్లు మొదలవుతాయి. అలాంటి వార్తే ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్‌చరణ్.. ఇది సింపుల్‌గా ఈ వార్త సారాంశం. వెట్రిమారన్ అనగానే.. ఆడుకాలం, విసారణై, వడాచెన్నై, అసురన్, విడుతలై 1 సినిమాలు గుర్తొస్తాయి. సామాజిక సమస్యలోని తీవ్రతను కఠినంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా తెరపై ఆవిష్కరించడం వెట్రిమారన్ శైలి. ఆయన తీసిన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. అందులో పాత్రలే కనిపిస్తాయి తప్ప, స్టార్లు కనిపించరు. అలాంటి దర్శకుడు రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడంటే, ఆ కథ ఎలా ఉంటుంది? అనే ఊహే రోమాంఛితం చేస్తుంది. నేరుగా తెలుగు సినిమా చేయాలనే కోరిక వెట్రిమారన్లో ఎప్పటినుంచో ఉంది. గతంలో తారక్‌కి కథ కూడా చెప్పారాయన. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. అయితే.. రీసెంట్గా రామ్‌చరణ్‌కు ఓ కల్ట్ సబ్జెక్ట్ వినిపించారట వెట్రిమారన్. చరణ్‌కు కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది. ప్రస్తుతం శంకర్ ‘గేమ్‌చేంజర్’, బుచ్చిబాబు సాన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు చరణ్. ఈ సినిమాల తర్వాత రామ్‌చరణ్ చేసే సినిమా ఇదే అవుతుందనే వార్త బలంగా వినిసిస్తున్నది.