‘ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాదభరితమైన ఈ సంఘటన ఆ ఊరిలోనే సమాధి అయింది’ అన్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన ఓ నిర్మాతగా ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్‌తో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకుడు.
నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ ఫీల్‌తో బయటకొస్తారని బన్నీ వాసు అన్నారు.
ఇది పక్కా తెలంగాణ ప్రేమకథా చిత్రమని, ఇక్కడి స్థానికత, ప్రజల జీవితాలను ఆవిష్కరిస్తుందని నటుడు చైతు జొన్నలగడ్డ తెలిపారు. సింగిల్ నరేషన్లో వేణు ఊడుగుల ఈ కథకు ఓకే చెప్పారని దర్శకుడు సాయిలు కంపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి, ఈటీవి విన్ నితిన్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.