Rajinikanth | సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా ఫలితంతో సంబంధం లేకుండా.. అల్టిమేట్ క్రేజ్ సంపాదించుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రజినీకాంత్ అందరికంటే ముందు ఉంటాడు. ఫలితంతో సంబంధం లేకుండా ఈయన వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు. నిర్మాతలు కూడా ఈయనకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదేనా జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కేవలం ఒకే రాత్రిలో జరిగే కథ ఇది అని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు రజనీకాంత్.
ఇందులో కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళం నుంచి శివ కార్తికేయన్, మలయాళం నుంచి మోహన్ లాల్, తెలుగు నుంచి సునీల్, హిందీ నుంచి జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. అదే కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న లాల్ సలామ్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది ఐశ్వర్య. మాజీ భర్త ధనుష్ 3 సినిమాతో దర్శకురాలిగా మారిన ఐశ్వర్య.. ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ హీరోగా మరో చిన్న సినిమా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు. దర్శకురాలిగా ఇప్పటికి తన తొలి విజయం కోసం వేచి చూస్తూనే ఉంది ఐశ్వర్య.
ఇలాంటి సమయంలో లాల్ సలామ్ సినిమా ఈమె కెరీర్ కు కీలకంగా మారింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. కథను మరుగు తిప్పే ఒక ముస్లిం పాత్ర ఇది. దీనికోసం కేవలం వారం రోజులు డేట్స్ ఇచ్చాడు రజిని. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నాడు. ఒక రోజుకు 4 కోట్ల చొప్పున 28 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కూతురు సినిమా అయినా కూడా రెమ్యూనరేషన్ దగ్గర ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు రజనీకాంత్.
నిర్మాతలు కూడా సూపర్ స్టార్ అడిగినంత ఇచ్చేశారు అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రజనీ లేకపోతే ఈ సినిమా మార్కెట్ కనీసం 20 కోట్లు కూడా అవ్వదు. ఒకసారి ఆయన అడుగు పెడితే సినిమా స్వరూపం మారిపోతుంది. తక్కువలో తక్కువ 50 కోట్ల బిజినెస్ తో పాటు డిజిటల్ సైడ్ నుంచి మరో 50 కోట్లు కచ్చితంగా వస్తాయి. ఈ లెక్కలన్నీ వేసుకున్నప్పుడు రజనీకాంత్ రెమ్యూనరేషన్ తక్కువగానే అనిపిస్తుంది. ఏదేమైనా ఒక చిన్న క్యారెక్టర్ చేసి దానికి కూడా రికార్డు రెమ్యూనరేషన్ తీసుకోవడం రజనీకాంత్ కే చెల్లింది. మరి ఈయన గెస్ట్ రోల్ కూతురు సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.