Rajinikanth | సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి దేశ వ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఈ దిగ్గజం 75 ఏళ్ల వయసులోనూ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. త్వరలో రజనీకాంత్ నటించిన కూలీ, జైలర్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా, వాటి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తమిళ రచయిత ఎస్. వెంకటేషన్ రచించిన ‘వేల్పారి’ పుస్తకానికి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో, చెన్నైలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు దర్శకుడు ఎస్. శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రజనీ తనదైన స్టైల్లో సరదా వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, రామకృష్ణ ఆశ్రమం ప్రభావంతో తనకు పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడిందని తెలిపారు. రచయిత జయకంధన్ రచనలు తనను భావోద్వేగానికి గురిచేశాయని చెప్పారు. ‘వేల్పారి’ పుస్తకాన్ని తన స్నేహితులు సిఫారసు చేయడంతో చదవడం ప్రారంభించానని, ఇప్పటివరకు 25 శాతం పూర్తయ్యిందని తెలిపారు. సినిమాలకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి పఠనానికి సమయం కేటాయిస్తానని చెప్పారు.
రజనీకాంత్ చేసిన మరో ఆసక్తికర వ్యాఖ్య ఏంటంటే తన కన్నా కమల్ హాసన్ మేధావి అని.. “ఇలాంటి కార్యక్రమాలకు కమల్ హాసన్ లేదా శివకుమార్ లాంటి మేధావులని ఆహ్వానించాలి. నేను 75 ఏళ్ల వయస్సులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నడిచే మనిషిని,” అంటూ నవ్వులు పూయించారు. శివకుమార్ మంచి వక్త ఆయన అయితే మహాభారతంతో పాటు తిరుక్కురల్ గురించి ఏకధాటిగా 6 గంటల పాటు ప్రసంగించగలరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు తలైవా. అయితే రజనీకాంత్ తనపై తానే సెటైర్స్ వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వేల్పారి నవల ఆధారంగా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు రజనీకాంత్.