Raghava Lawrence | స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ ప్రధానపాత్రధారులుగా ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో రూపొందుతోన్న అడ్వంచర్ మూవీకి ‘బుల్లెట్ బండి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కతిరేసన్ ఈ చిత్రానికి నిర్మాత. మంగళవారం లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో లారెన్స్ స్టయిలీష్‌గా డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపిస్తున్నారు. స్ట్రయిట్ తెలుగు సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ సింగ్, సంగీతం: సామ్ సి.ఎస్. నిర్మాణం: ఫైవ్‌స్టార్ క్రియేషన్స్.
రమేష్‌వర్మ దర్శకత్వంలో లారెన్స్ నటిస్తున్న యాక్షన్ అడ్వంచరస్ చిత్రానికి ‘కాలభైరవ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఇది హీరోగా లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ని, ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ది వరల్డ్ విత్ ఇన్’, ‘ఏ ప్యాన్ ఇండియా సూపర్‌హీరో ఫిల్మ్’ వంటి లైన్స్ ఫస్ట్‌లుక్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 200కోట్ల భారీ బడ్టెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.