Radhika Apte | బాలీవుడ్‌తో పాటు సౌత్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే సినీ రంగంలో తన ఇరవై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న వివక్ష అలాగే బాడీ షేమింగ్ గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ తన గుండె ఆగిపోయినంత పని అవుతుందని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా 2000వ దశకం చివరలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చిందని, అప్పుడు షూటింగ్ సెట్స్‌పై ఉన్న పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. ఒక చిన్న ఊరిలో జరిగిన షూటింగ్ సమయంలో సెట్ అంతా మగవారే ఉండేవారని, అక్కడ తన శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని రాధిక వెల్లడించారు. సెట్లో ఉన్నవాళ్లు నా బమ్స్ మరియు బ్రెస్ట్స్ దగ్గర ప్యాడింగ్ పెంచమని అడిగేవారు. ‘అమ్మా.. మోర్ ప్యాడింగ్’ అని పిలిచేవారు. ఆ మాటలు విన్నప్పుడు తనకు నవ్వాలో ఏడవాలో అర్థమయ్యేది కాదని రాధికా వాపోయింది. అప్పట్లో తనకు రక్షణగా మేనేజర్లు, ఏజెంట్లు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఆ మానసిక వేదనను అనుభవించానని, ఆ పరిస్థితులు తనను ఇప్పటికీ మానసిక గాయానికి (Trauma) గురిచేస్తాయని ఆవేదన చెందారు. హిందీ పరిశ్రమలో కూడా కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల ప్రవర్తన నచ్చక తానంతట తానే పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నానని, ఒకవేళ వారి పేర్లు బయటపెడితే ప్రపంచమంతా షాక్ అవుతుందని ఆమె తెలిపింది. పరిశ్రమలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు కూడా వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించకపోవడం విచారకరమని అభిప్రాయపడిన రాధికా ఆప్టే, ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సాలీ మొహబ్బత్’ జీ5లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా ఈ విషయాలను పంచుకుంది.