Actress Raashi Khanna | అదేంటో ఒక్కోసారి అన్ని కుదిరి రేపో మాపో సెట్స్ మీదకు వెళ్తుందనగా సడ్డెన్‌గా సినిమా నుంచి ప్రధాన పాత్రదారుల్లో ఎవరో ఒకరు తప్పుకున్నట్లు ప్రకటిస్తుంటారు. కొంత మంది పర్సనల్ ప్రాబ్లెమ్స్ వల్ల సినిమా నుంచి తప్పుకుంటే, మరికొందరు మాత్రం క్రియేటీవ్ డిఫరెన్స్ వల్ల తప్పుకుంటారు. ఏదేమైనప్పటికీ అలా తప్పుకున్నారంటే దర్శక, నిర్మాతలు తలలు పట్టుకొని కూర్చోవాల్సిందే. మళ్లీ కొత్త నటులను తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటికే మిగితా నటీనటులు డేట్స్ కూడా ఇచ్చేసుంటారు. దాంతో మళ్లీ వాళ్ల డేట్స్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా నిర్మాతకు లక్షల్లో నష్టం వస్తుంది. ప్రస్తుతం అలాంటి సందర్భమే కోలీవుడ్‌లో చోటు చేసుకుంది.
లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి, పిల్లలు తర్వాత కూడా సినిమాలతో యమ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఆమె జవాన్‌తో పాటు మరో తొమ్మిది సినిమాలను లైనప్‌లో పెట్టింది. కాగా వైనాట్ శశికాంత్ దర్శకత్వంలో నయన్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపో మాపో ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి నయన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాంతో వైనాట్ శశికాంత్ నయన్ స్థానంలో రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటుడు మాధవ్, సిద్ధార్థ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఈ లేడి ఓరియెంటెడ్ సినిమాకు ది టెస్ట్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో గాని, లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో గాని ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.