టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ (Satya Dev) టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం గాడ్సే (Godse). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీ గణేశ్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నాడు. కేరళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్డేట్ను ట్రైలర్ (Godse Trailer) రూపంలో అందించారు.
‘సత్యమేవ జయతే అంటారా..ధర్మోరక్షతి రక్షిత: అంటారు. కానీ సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదు..’అంటూ సత్యదేవ్ చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. నా కళ్ల ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండటం నా వళ్ల కాదు అని ఐశ్వర్యలక్ష్మి అంటోంది. ‘సార్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్, నో ఎమోషన్స్ అండ్ నో డీవీయేషన్స్’ అని సత్యదేవ్ స్టైల్లో సాగుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
‘ఈ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతున్నోడే పార్లమెంట్లో ఉండాలి, మర్యాద ఉన్నోడో మేయర్ కావాలి..సభ్యత ఉన్నోడే సర్పంచ్ కావాలి..’అంటూ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో గుర్తుచేస్తూ సత్యదేవ్ చెప్తున్న డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పించడమే కాదు..అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
గాడ్సే చిత్రాన్ని జూన్ 17న విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో చైతన్య కృష్ణ, పృథ్విరాజ్, తనికెళ్లభరణి, నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, నోయెల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కాశ్యప్, సాండీ అద్దంకి మ్యూజిక్ డైరెక్టర్లు కాగా.. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు.