కన్నడ అగ్ర హీరో దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకుడు. కిషోర్ పత్తికొండ నిర్మించారు. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను హీరో శ్రీకాంత్, విజయ్ ఎమ్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘పునీత్‌రాజ్ కుమార్ ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. దేశం కోసం జేమ్స్ చేసిన పోరాటం స్ఫూర్తివంతంగా ఉంటుంది. యాక్షన్ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, లిరికల్ వీడియోకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: చరణ్‌రాజ్, నిర్మాత: కిషోర్ పత్తికొండ.