అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జయాపజయాలకు అతీతమైన విజయ్ దేవరకొండ స్టార్డమ్.. మళ్లీరావా, జెర్సీ చిత్రాలతో ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ.. ఈ రెండే ఈ సినిమా అంచనాలు పెరగడానికి కారణాలు.
‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానుల్ని ఓ విధంగా ఊరిస్తున్నారనాలి. ఇటీవల తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఈ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టారాయన. “కింగ్డమ్’కు సంబంధించిన ఏ పోస్ట్ పెట్టినా మీ తీపి శాపాలు మాకు వస్తూనే ఉంటాయి. నన్ను నమ్మండి.. మా టీమ్ మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చేందుకు అహరహం శ్రమిస్తున్నది.
ఇటీవలే సినిమా చూశాను. మీకు గట్టిగా మాటిస్తున్నా. ‘కింగ్డమ్’ విజయం రాసిపెట్టుంది.. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్మెంట్లతో కలుద్దాం’ అని ఆ పోస్ట్‌లో నాగవంశీ పేర్కొన్నారు. ఈ నెల చివరివారంలోగానీ, వచ్చే నెల తొలివారంలోగానీ ఈ సినిమా విడుదల కావొచ్చని ఫిల్మ్ వర్గాల అంచనా. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీబోర్సే కథానాయిక. సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు.