Happy Ending | యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్’ అపూర్వ రావ్ కథానాయిక. ఈ చిత్రాన్ని హమ్స్టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేశ్‌కుమార్, సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముంగిట్లోకి రానున్నది. ఈ సందర్భంగా పలు విశేషాలను నిర్మాత అనిల్ పాత్రికేయులతో పంచుకున్నారు.
‘సిల్లీ మాంక్స్.. కంటెంట్ క్రియేటింగ్ కంపెనీ. మేము 24 కిస్సెస్ సినిమా ద్వారా ప్రొడక్షన్లోకి వచ్చాం. అది యూత్‌ఫుల్ మూవీ అయినా సందేశాత్మక కథ. ఇప్పుడు ‘హ్యాపీ ఎండింగ్’ కూడా యూత్‌కు నచ్చే మెస్సేజ్ ఒరియంటెడ్ మూవీ. మేకింగ్‌పై అవగాహనారాహిత్యంతో మూడో వ్యక్తిని నమ్మి రూ.కోట్లు నష్టపోతున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్‌కు మేం అండగా ఉంటున్నాం. ప్రొడక్షన్ నుంచి రిలీజ్ దాకా వారధిలా పనిచేస్తున్నాం.
‘హ్యాపీ ఎండింగ్’ అనుకున్న బడ్జెట్లో ముగించాం. యష్ కొత్త హీరో కాబట్టి రిలీజ్ తర్వాత స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. సినిమాకు కథే ముఖ్యం. బాగా ప్రిపేర్ అయ్యాం కాబట్టే 30 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేశాం. ‘హ్యాపీ ఎండింగ్’ స్టోరీపై మాకు నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు వినోదం పొందడమే కాదు ఒక ఆలోచనలో పడతారు. యష్, అపూర్వ థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కాబట్టి బాగా ఫర్ఫార్మ్ చేశారు. మా సంస్థ నుంచి ఓటీటీ తీసుకొచ్చే ఆలోచన ఇప్పుడు లేదు. కొత్త హీరోతో చేసిన మరో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది.