నాని ‘జెంటిల్‌మేన్’తో తెలుగునాట అభినయానికి ‘శ్రీకారం’ చుట్టిన కన్నడ కస్తూరి ప్రియాంక అరుళ్ మోహన్.. ‘సరిపోదా శనివారం’తో టాలీవుడ్లో తొలి విజయాన్ని అందుకున్నారు. తమిళనాట అగ్రతారగా కొనసాగుతూ.. తెలుగులో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా దూసుకుపోతున్న ఈ అందాల తార పవన్‌కల్యాణ్ ‘ఓజీ’లో ‘కణ్మని’గా కనిపించనున్నారు. ఈ నెల 25న ‘ఓజీ’ విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ప్రియాంక అరుళ్ మోహన్. ‘ఓజీ’తో నాది రెండున్నరేండ్ల ప్రయాణం. పవన్‌సార్‌తో కలిసి నటించడమే గొప్ప అదృష్టమైతే.. ‘కణ్మని’ లాంటి మంచి పాత్ర దొరకడం మరింత అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలన్నింటిలో కణ్మని స్పెషల్.
ఇది 80ల్లో జరిగే కథ. అందుకే అప్పటి వేషధారణ, ఆనాటి అమ్మాయిల ప్రవర్తన.. తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. కణ్మని ఇన్నోసెంట్ గర్ల్. ఆహార్యం సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ప్రేమ గాఢంగా ఉంటుంది. ఓజస్ గంభీర జీవితాన్ని మలుపు తిప్పేది ఆ పాత్రే. పవన్‌స్టార్‌తో పని చేయడం ఓ గొప్ప అనుభవం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హీఈజ్ జెంటిల్మెన్. అందర్నీ సమానంగా చూస్తారు. ‘ఓజీ’ కేవలం యాక్షన్ సినిమానే కాదు. ఇందులో మనసుల్ని మెలిపెట్టే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. దర్శకుడు సుజిత్ క్లారిటీ ఉన్న దర్శకుడు. నా పాత్ర, లుక్ బాగున్నాయంటే కారణం తనే’ అని చెప్పింది ప్రియాంకఅరుళ్ మోహన్.