Aadujeevitham Trailer | ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. తెలిసిన కథలనే కొత్తగా, ఎలాంటి హంగులకు పోకుండా, ఎంటర్టైనింగ్గా చూపించడంలో మలయాళ మేకర్స్ దిట్ట. ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమార్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఆయన సినిమాలను జల్లెడ పట్టి మరీ వెతికి చూస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్, జనగణమన, కడువ వంటి సినిమాలతో పృథ్వి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఇక ప్రభాస్ సలార్‌లోనూ కీలకపాత్ర పోషిస్తుండటంతో ఇక్కడ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పృథ్విరాజ్ నటించిన ‘ది లైఫ్ ఆఫ్ గోట్’ సినిమా ట్రైలర్ రిలీజైంది.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తి పెంచుతుంది. ట్రైలర్‌తోనే కథలోని మేయిన్ థీమ్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఊరు నుంచి బతుకుదెరువు కోసం అరబ్ దేశానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడే ఓ యువకుడి కష్టాల గురించి సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌తో స్పష్టం అయింది. సౌదీలో ఇమ్మిగ్రేషన్ కష్టాలు, పాస్ పోర్టులు లాక్కొని బానిసలుగా మార్చుకోవడం, ఎడారిలో బానిస బతుకు, వలస వ్యక్తి కష్టాలు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు. నజీబ్ మొహమ్మద్ అనే కేరళ వ్యక్తి పాత్రలో పృథ్విరాజు నటించాడు. పృథ్వి సౌదీకి వెళ్లి అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించాడు? బానిస బతుకు నుంచి ఎలా విముక్తి చెందాడు? అనే అంశాల చుట్టు ఈ కథ తిరుగుతుంది.
నేషనల్ అవార్డు గ్రహిత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. సినిమా షూటింగ్ చాలా వరకు ఎడారి ప్రాంతంలోనే జరిగింది. కాగా పృథ్విరాజ్‌కు జోడీగా అమలాపాల్ నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ ఏడాది సమ్మర్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో ‘ఆడుజీవితం’ పేరుతో ఈ మూవీ విడుదల కానుంది.