Prince Cecil | టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ‘బస్ స్టాప్’, ‘డీజే టిల్లు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ప్రిన్స్ సెసిల్ తన ప్రేయసి సాయి ప్రతిమతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లోని అందమైన వనకా నగరంలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో తెలుగు సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వివాహ వేడుకలో ప్రిన్స్ సెసిల్ ఐవరీ కలర్ సంప్రదాయ దుస్తుల్లో రాకుమారుడిలా కనిపించగా, సాయి ప్రతిమ ఎరుపు రంగు పట్టుచీర, సంప్రదాయ ఆభరణాల్లో అందంగా మెరిశారు. వీరిద్దరి జంటను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. వీరి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, అన్యోన్యతతో నిండాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, సన్నిహితుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ప్రిన్స్, సాయి ప్రతిమల ప్రేమకథ గతేడాది సెప్టెంబర్‌లో ఓ కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా మారింది. పరస్పర అభిరుచులు కలవడంతో వీరి బంధం మరింత బలపడింది. ఈ ఏడాది జూన్‌లో ఇరు కుటుంబాల ఆశీస్సులతో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రిన్స్ తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వేడుకలో నటుడు ప్రియదర్శి కూడా పాల్గొని సందడి చేశారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ప్రేమజంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ప్రిన్స్ జీవిత భాగస్వామి సాయి ప్రతిమ న్యూజిలాండ్‌కు చెందిన ఎన్నారై యువతి. అక్కడే స్థిరపడిన మాచిరాజు వెంకట రమేష్, లక్ష్మీ సుజాతల కుమార్తె అయిన ఆమె న్యూజిలాండ్‌లోనే పుట్టి పెరిగినట్లు సమాచారం. విదేశీ గడ్డపై జరిగినప్పటికీ, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వివాహ వేడుకను నిర్వహించారు.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే దర్శకుడు తేజ దృష్టిలో పడిన ప్రిన్స్ సెసిల్ 2012లో ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. హీరోగా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రిన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘రొమాన్స్’, ‘మనసును మాయ చేయకే’ వంటి చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు ‘డీజే టిల్లు’, ‘స్కంద’, ‘అశ్వథామ’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ‘బిగ్ బాస్ తెలుగు’ తొలి సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యారు.