ప్రస్తుతం ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్నది. పలువురు అగ్ర హీరోలు సోషల్‌మీడియా వేదికగా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది వరకు ఇదే ధోరణి కనిపిస్తున్నది. మరోవైపు ‘ధురంధర్: ది రివేంజ్’ ప్రాపగాండా మూవీ అని, ఓ రాజకీయ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినదని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. గత కొన్నేళ్లుగా ప్రణాళిక ప్రకారం వస్తున్న ప్రాపగాండా సినిమాల పరంపరలో ‘ధురంధర్’ ఒకటని సామాన్య ప్రజానీకంతో పాటు పలువురు మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ తన ఎక్స్ ఖాతాలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
కొందరు తెలుగు అగ్ర హీరోలు ‘ధురంధర్’ చిత్రాన్ని అదే పనిగా పొగడటం వెనకున్న ఆంతర్యమేమిటని పరోక్షంగా ప్రశ్నించారు. ‘తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్‌చరణ్ ‘ధురంధర్’ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఇదే స్థాయిలో ఏ బాలీవుడ్ హీరో అయినా ట్వీట్ చేశాడా? అని ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్‌పై ప్రకాష్‌రాజ్ స్పందించారు. ‘ ఆబ్లిగేషన్ (తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా పని) తాలూకు సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపించాయని అర్థమవుతున్నది’ అంటూ ప్రకాష్‌రాజ్ వ్యంగ్యాత్మక ధోరణిలో ఆ పోస్ట్‌పై ప్రతిస్పందించారు. ఓ రాజకీయ పార్టీ ప్రోద్భలంతోనే ‘ధురంధర్: ది రివేంజ్’ చిత్రంపై సినిమా తారలు మూకుమ్మడిగా పొగడ్తలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.