‘సలార్’ వసూళ్లలో దూసుకుపోతున్నది. ఈ వేగం ఎందాకా సాగుతుందో చూడాలి. ప్రభాస్ కెరీర్‌లోని భారీ విజయాల్లో ఒకటిగా ‘సలార్’ను చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా గురించి ఓ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడారు. ‘ నా కెరీర్లో చేసిన విభిన్న పాత్రల్లో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్‌నీల్ కథ చెప్పగానే కాసేపు అదే ట్రాన్స్‌లో ఉండిపోయాను. నిజంగా సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇది. అందుకే వెంటనే అంగీకరించాను.
‘బాహుబలి’ నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నాకు నెలకొంది. జనాల మైండ్ సెట్లో కూడా మార్పు వచ్చింది. మూస సినిమాలను ఇష్టపడటంలేదు. అందుకే కొత్తగా వెళ్లాలనే మంచి కథలు ఎంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచం భారతీయ సినిమాలవైపు చూస్తున్నది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ అని కాకుండా భారతీయ సినిమా పరిశ్రమగా ప్రపంచం మనల్ని గుర్తిస్తున్నది. దీనికి రాజమౌళి, ప్రశాంత్‌నీల్ లాంటి దర్శకులే కారణం. వారితో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప అనుభూతి. ‘సలార్’ పార్ట్2 మరింత అద్భుతంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.