అగ్రహీరో ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం అనిపించక మానదు. ప్రస్తుతం ఆయన మార్కెట్ వందలకోట్ల పైమాటే. అంత పెద్ద పాన్ఇండియా స్టార్డమ్ వేరే హీరోకెవరికైనా ఉంటే.. ఆచితూచి ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేస్తూ.. ప్రశాంతంగా కెరీర్ సాగించేవారు. కానీ ప్రభాస్ ఆ విధానానికి పూర్తి విరుద్ధం. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఓ అరడజను సినిమాలున్నాయి. వాటిలో ‘ది రాజాసాబ్’ త్వరలో విడుదల కానుంది. నిర్మాణంలో ఉన్న ‘ఫౌజీ’ కూడా ఈ ఏడాది చివర్లోనో వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ రెండిటి తర్వాత ప్రభాస్ చేసే సినిమా ఏంటి? అనే కొత్త ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. దానికి కారణం..
‘కల్కి 2898ఏడీ’ నిర్మాత సి.అశ్వనీదత్. నిజానికి ‘ఫౌజీ’ తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ చేస్తారని, ‘స్పిరిట్’కోసం ఆయన ఏడాది పాటు బల్క్ డేట్స్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ఇచ్చారని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే.. కల్కి నిర్మాత అశ్వనీదత్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ‘కల్కి 2’ను మొదలుపెట్టబోతున్నామని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామని, ‘కల్కి 2’ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆయన చెప్పినట్టు సెప్టెంబర్‌లో ‘కల్కి2’ మొదలైతే.. ‘స్పిరిట్’ మాటేంటి? ‘సలార్ 2’ సంగతేంటి? ప్రశాంత్‌వర్మ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం డార్లింగ్‌కే తెలియాలి.