Prabhas-Maruthi Movie | ప్రభాస్-మారుతి కాంబినేషన్లో సినిమా గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఈ కాంబోలో సినిమా ఉందా? లేదా? అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయని ప్రచారం జరిగింది. అయితే చిత్రబృందం ఎలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17నుండి స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ కోసం ప్రభాస్ కేవలం వారం రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట. ఈ షెడ్యూల్లో ప్రభాస్, సంజయ్ దత్ మధ్య సన్నివేశాలను చిత్రబృందం తెరకెక్కించనుందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు టాక్. ఈ సినిమాను మారుతి ‘రాజా డిలక్స్’ అనే థియేటర్ చుట్టు తిరిగే తాత-మనవళ్ళ కథతో రూపొందించనున్నాడట. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ నటించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తుంది. కేవలం ఈ సెట్ కోసమే మేకర్స్ 6కోట్లు ఖర్చు చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.