Poonam Kaur | నటి పూనమ్ కౌర్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తరచూ క్రిప్టిక్ పోస్టులు చేస్తుంటారు. ఎవరినీ నేరుగా పేరుతో ప్రస్తావించకుండా పలు విషయాలపై స్పందించే పూనమ్ కౌర్.. తాజాగా చేసిన వరుస పోస్టులు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ దర్శకుడిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఏమాత్రం ఆదర్శం లేని, వంద శాతం ప్రచారం చేసుకునే ఈ దర్శకుడి నుంచి నటీనటులను, నిర్మాతలను దేవుడే కాపాడాలి. హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే ఇతను తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ వ్యక్తికి అసలు ఎలాంటి ఆదర్శం లేదు. కాబట్టి ఇతనికి దూరంగా ఉండండి. ఈ తాంత్రికుడు, నకిలీ గురువు నుంచి అమాయకులను ఆ దేవుడే కాపాడాలి’’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.
అంతటితో ఆగకుండా మరో పోస్టులో ‘‘ఏకే అనేది మరో నటుడి విషయంలో ‘అజ్ఞాతవాసి’ లాంటిది.. అంతే’’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టుల్లో పూనమ్ కౌర్ ఎక్కడా ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పూనమ్ కౌర్ చేసిన పోస్టుల్లో ‘ఆదర్శం’, ‘ఏకే’, ‘గురు’, ‘అజ్ఞాతవాసి’ వంటి పదాలు ఉండటంతో.. నెటిజన్లు వీటిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో లింక్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: ఏకే 47’ సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలోనే పూనమ్ ఈ పోస్టులు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే పూనమ్ కౌర్ తన పోస్టుల్లో ఎక్కడా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించలేదు. అందువల్ల ఈ వ్యాఖ్యలు నిజంగానే ఆయనను ఉద్దేశించేవేనా? లేక మరెవరినైనా టార్గెట్ చేశారా? అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: ఏకే 47’ విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ముందుగా అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. ఆ తర్వాత అక్టోబర్ 9కి విడుదల తేదీని మార్చారు.అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరికొన్ని షూటింగ్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో అక్టోబర్ 9న కూడా సినిమా విడుదల కావడం లేదని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.