Pithapuram Lo Ala Modalaindi | ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన సరికొత్త కుటుంబ కథా చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘ప్రేయసి రావే‘ వంటి అద్భుతమైన చిత్రంతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కించడంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటులు డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూనియర్ పవన్ కళ్యాణ్, జబర్దస్త్ శేషు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడం విశేషం. మహేష్ చంద్ర సినిమా టీమ్ మరియు ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా పతాకాలపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రేమ, చక్కని హాస్యం, హృదయాలను హత్తుకునే సెంటిమెంట్, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధం వంటి భావోద్వేగాల కలబోతగా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా నేటి యువతకు ఒక చక్కటి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన దైనందిన జీవితంలో చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుందని, సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం ఇస్తున్న వాయిస్ ఓవర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ అలాగే రెండు పాటలకు యూట్యూబ్‌లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, ఎక్కడో కెమెరా పెట్టి లైవ్‌గా రికార్డ్ చేశారా అన్నంత సహజంగా ఈ సినిమా సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు వెల్లడించారు. ‘ఇరుముడి’, ‘విశ్వనాథం అండ్ సన్స్’, ‘మా ఇంటి బంగారం’ వంటి ఆణిముత్యాల కోవకు చెందే ఈ సినిమాను కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ప్రశాంతంగా ఆస్వాదించవచ్చని వారు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఏదోటి కథా సహకారం, మాటలు అందించగా, బి. సత్యనారాయణ ఎడిటర్‌గా, జి.సి. క్రిష్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.