పెండ్యులం
ఈటీవీ విన్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: విజయ్ బాబు, అనుమోల్, దేవకి రాజేంద్రన్, ప్రకాశ్ బారె, అమల్ దేవ్ తదితరులు
దర్శకత్వం: రెజిన్ ఎస్ బాబు
మలయాళ చిత్రసీమ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నది. సరికొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. తక్కువ బడ్జెట్లోనే బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్నది. అలా.. కలల నేపథ్యంలో ‘పెండ్యులం’ తెరకెక్కింది. ఇష్టమైన వారిని కలలోకి ఆహ్వానించడం. నచ్చిన వారి కలలోకి వెళ్లడం సాధ్యమే! అని చెప్పే ‘లూసిడ్ డ్రీమింగ్’ అనే కాన్సెప్ట్‌తో సాగుతుందీ కథ. కల-కాలం అనే రెండు అంశాల చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. రెండేళ్ల కింద మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. క(థ)లలోకి వెళ్తే.. మహేశ్ నారాయణన్ (విజయ్ బాబు) డాక్టర్. భార్య శ్వేత (దేవకి రాజేంద్రన్), కూతురు తన్మయి (అవని)తో కలిసి ఆస్ట్రేలియా నుంచి భారత్ వస్తారు.
ఒకరోజు భార్యాపిల్లలతో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్తాడు. అలా ఒక ప్రదేశానికి వెళ్లిన తర్వాత, గతంలో ఆ ప్రదేశంతో తనకు అనుబంధం ఉన్నట్టుగా ఫీలవుతాడు మహేశ్. గతాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కడే ఓ దుకాణం దగ్గర ఆగి.. టీ తాగుతుంటారు. ఇంతలో తన్మయి పొరపాటు వల్ల కార్ కీస్ డిక్కీలోనే ఉండిపోతాయి. దాంతో, వాళ్లంతా ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే.. రోడ్డుపక్కన పొదల్లో స్పృహలేకుండా పడి ఉంటాడు మహేశ్. రాత్రి తనను ఓ లారీ ఢీ కొట్టిందని భార్యతో చెబుతాడు. కానీ, ఎలాంటి గాయాలు, యాక్సిడెంట్ ఆనవాళ్లు లేకపోవడంతో.. ఆ మాటలను ఆమె నమ్మలేకపోతుంది. తనకు ఏదో జరుగుతున్నదని మహేశ్ భావిస్తాడు.
అదేంటో తెలుసుకోవడానికి జాన్ మాస్టర్‌ను కలుస్తాడు. అయితే, వేరేవారి కలలోకి మహేశ్ వెళ్లడం వల్లే ఈ సమస్య తలెత్తిందని జాన్ మాస్టర్ చెబుతాడు. ఆ కల కన్నది ఎవరనే విషయం తెలిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతాడు. మరి మహేశ్ ఎవరి కలలోకి వెళ్లాడు? అతని కలలోకి ఎవరెవరు వస్తుంటారు? కొన్ని ప్రదేశాలు అంతకుముందే చూసినట్టుగా మహేశ్‌కు ఎందుకు అనిపిస్తుంది? 15 ఏళ్ల క్రితమే డిస్పోజ్ అయిన లారీ.. మహేశ్‌ను ఎలా ఢీకొట్టింది? తన సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో.. మహేశ్‌కు తెలిసిన నిజాలు ఏమిటి? సినిమాలో కీలకమైన ఆమీర్ – ఏంజెల్ ఎవరు? అని తెలుసుకోవాలంటే.. కలలాంటి ఈ కథలోకి వెళ్లాల్సిందే!