Roshan-sreeleela | సినీరంగంలో కొన్ని హిట్ పెయిర్స్ ఉంటాయి. వాళ్ల జోడీ మళ్లీ ఎప్పుడు రిపీటవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అందులో తాజాగా వెండితెరమీద ఆకట్టుకున్న జంట రోషన్, శ్రీలీల. వీళ్లిద్దరూ కలసి నటించిన చిత్రం పెళ్లిసందD. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది.ఇందులో శ్రీలీల తన నటన, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
రాఘవేంద్రరావు ఓ హీరోయిన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఆమె పెద్ద హీరోయిన్ అవడం అనేది గ్యారంటి అని శ్రీలీలతో మరో సారి ప్రూవ్ అయింది. పెళ్లిసందD చిత్రం తర్వాత శ్రీలీలకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఇప్పటికే రవితేజ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె వరుసగా నవీన్పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్, ఆశీశ్రెడ్డి లతో జతకట్టనుంది.
పెళ్లిసందD చిత్రంలో హీరోగా నటించిన రోషన్ కూడా రెండు సినిమాలకు సైన్ చేశాడు. అందులో వైజయంతీ బ్యానర్ ఒకటి. రోషన్ హీరోగా వైజయంతీ బ్యానర్లో తెరకెక్కనున్న చిత్రంలో శ్రీలీలను హీరోయిన్గా ఎంపికచేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుందట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.