Peddi | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో నిరాశ చెందిన అభిమానులు ఇప్పుడు ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘రంగస్థలం’ తరహాలో మాస్, రా లుక్‌లో చెర్రీ కనిపించడంతో పాటు ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో సినిమాపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్‌చరణ్‌కు జోడిగా నటిస్తోంది. ఇది రామ్ చరణ్‌తో చేస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో , ఈ కాంబోపై మంచి హైప్ ఏర్పడింది.
తెరవెనుక బుచ్చిబాబు జెట్ స్పీడ్‌తో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి 50 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్లో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో చరణ్, జాన్వీ ఇద్దరూ పాల్గొంటున్నారు. షూటింగ్ బ్రేక్ సమయంలో, బుచ్చిబాబు–జాన్వీ కలిసి హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా వీక్షించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. యాక్షన్ ఎపిసోడ్ పూర్తిగా ఔట్‌డోర్‌లో చేస్తుండడంతో వాతావరణం సహకరించకపోవడం వలన బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. వర్షాలు తగ్గిన వెంటనే మళ్లీ షూటింగ్‌ను పునఃప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ సినిమా ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో వచ్చే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్, భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడనంత విజువల్ ట్రీట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ‘రంగస్థలం’ కంటే ఇది చాలా గొప్పగా ఉంటుందని రామ్‌చరణ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే, చరణ్ ప్రస్తుతం మరో రెండు మూడు ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నట్లు సమాచారం.మొత్తానికి ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి.