Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా విజయవాడలో నిర్వహించిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనవిజయంగా నిలిచింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై చిత్రబృందానికి తమ మద్దతు తెలిపారు.
సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండగానే టికెట్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా, అన్ని ప్రధాన కేంద్రాల్లో టిక్కెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. తెలంగాణలో పూర్తి స్థాయి బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకపోయినా ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం తారాస్థాయికి చేరుకుంది. గత 24 గంటల్లోనే ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో దాదాపు 70 వేల టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. గంటకు సగటున వెయ్యికి పైగా టిక్కెట్లు విక్రయమవుతూ, ఆ ప్లాట్‌ఫామ్ ట్రెండింగ్ జాబితాలో ‘పెద్ది’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుకింగ్స్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఈ సంఖ్యలు మరింత వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ‘పెద్ది’పై మంచి బజ్ నెలకొంది. నార్త్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగాలు, యాక్షన్, గ్రామీణ నేపథ్యాన్ని మేళవిస్తూ రూపొందిన ఈ సినిమా సాధారణ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్న ‘పెద్ది’పై ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.