Pawan Kalyan | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మోదీ కూడా ఎన్టీఆర్ గొప్పతనాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వెళ్లి అక్కడ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని కూడా పంచుకున్నారు.
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.ఇక ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం.
ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు. “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు” అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుంది.రూ.2కు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజన్‌ను ఈ రోజుకీ కొనసాగిస్తోంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.