Siva Karthikeyan – Vijay Antony | గత రెండు రోజులుగా తమిళ ఇండస్ట్రీలో పరాశక్తి అనే టైటిల్ వివాదం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒకేరోజు ఇద్దరు స్టార్ నటులు తమ సినిమా టైటిల్‌ను పరాశక్తి అని ప్రకటించారు. ఇందులో శివకార్తికేయన్ సినిమాతో పాటు విజయ్ ఆంటోని సినిమా ఉంది.
ఆకాశం నీ హద్ధురా లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకురాలు సుధా కొంగర తన తదుపరి చిత్రం శివ కార్తికేయన్‌తో తీయబోతుంది. మొదట ఈ సినిమాలో హీరోగా సూర్యని అనుకున్నారు. కానీ అనుకొని కారణాలతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను సుధా శివ కార్తికేయన్‌తో తెరకెక్కించబోతుంది. అధర్వ, జయం రవి, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు శివాజి గణేషన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పరాశక్తి (Parasakthi) అనే టైటిల్ పెట్టారు.
అయితే ఈ మూవీ టైటిల్ ప్రకటించిన కాసేపటికే బిచ్చగాడు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని(Vijay Antony) తన కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. తమిళంలో తిరుమగన్(Thirumagan) అనే టైటిల్ పెట్టిన విజయ్ తెలుగులో పరాశక్తి అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఒకేరోజు రెండు కొత్త సినిమాలు ఒకే టైటిల్‌తో రావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద వివాదం చెలరేగింది. దీనిపై నటుడు విజయ్ ఆంటోని కూడా క్లారిటీ ఇస్తూ.. తెలుగులో పరాశక్తి అనే టైటిల్‌ను నేను గత ఏడాది జూలైలోనే రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపాడు. దీంతో పరాశక్తి టైటిల్ విజయ్ ఆంటోనికే చెల్లుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే పరాశక్తి టైటిల్‌ను వదిలేసుకుంటున్నట్లు విజయ్ అంటోని టీం ప్రకటించింది. దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ నటించిన పరాశక్తి చిత్రం 73 ఏండ్ల క్రితం విడుదలై ఇప్పటికి అభిమానుల ఆదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని ఏవీఎం సంస్థ నిర్మించింది. అయితే ఈ టైటిల్‌ను శివ కార్తికేయన్ సినిమాకు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు విజయ్ ఆంటోని ప్రకటించాడు. తెలుగులో తన సినిమా టైటిల్‌ను మార్చబోతున్నట్లు తెలిపాడు.