Janhvi Kapoor | బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటి జాన్వీ కపూర్.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’తో ఈ వివాదం తలెత్తింది. ఈ సినిమాలో జాన్వీ పోషించిన మలయాళీ యువతి పాత్రపై ఓ మలయాళ గాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ రోమాంటిక్ కామెడీ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది.
ఇందులో జాన్వీ ఒక మలయాళీ యువతిగా కనిపించనున్నారు. లుక్, డ్రెస్సింగ్ స్టయిల్ విషయంలో జాన్వీకి మంచి ప్రశంసలు వచ్చాయి. జాన్వీ మలయాళ యాస (Malayali Accent)పై నెటిజన్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాన్వీ పాత్రపై సోషల్ మీడియాలో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ఒక మలయాళీ పాత్రకు మలయాళ నటిని ఎందుకు ఎంపిక చేయలేదు? ఒకటే సంస్కృతిని సరైన రీతిలో ప్రతిబింబించాలంటే.. అక్కడి వ్యక్తుల్ని తీసుకోవాల్సిందే కదా!’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా జాన్వీ మాట్లాడిన మలయాళ యాసను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే, జాన్వీ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
పవిత్ర మీనన్‌పై మండిపడ్డారు. ఆమె వీడియోను పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయగా.. ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోను తొలగించింది. దాంతో పవిత్ర ఇంతటితో ఆగకుండా తాను పోస్ట్ చేసిన వీడియో తొలగించారని.. స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇది వివాదాన్ని మరింత ఉధృతం చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘ప్రాంతీయ పాత్రలకు ఆయా భాషలకే చెందిన నటులను తీసుకోవడమే సరైన విధానం’ అంటూ పవిత్రకు మద్దతు తెలుపగా.. నటనకు భాషతో సంబంధం లేదు.. ఒక నటి పాత్రను నిజాయితీగా పోషిస్తే చాలు అంటూ జాన్వీకి మద్దతు తెలిపారు. ఈ వివాదం సినిమా విడుదలకు ముందు ఊహించని హైప్‌ను తీసుకువచ్చింది. అయితే, ఈ వివాదంపై చిత్రబృందం ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ అంశంపై జాన్వీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.