Papa Movie | గతేడాది తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం దాదా (DADA). కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ (Kavin) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. కేవలం రూ.4 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. ఇక ఈ చిత్రం ఓటీటీకి వచ్చిన అనంతరం అందులో కూడా రికార్డు వ్యూస్ సాధించింది. ఇక భాషతో సంబంధంలేకుండా అన్ని రాష్ట్రాల సినీ లవర్స్ ఈ సినిమాను దాదాపుగా చూసేసారు. అయితే ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను తెలుగులో పా..పా..(PAPA) పేరుతో డబ్ చేయనుండగా.. పాన్ ఇండియా మూవీస్ & జేకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నీరజ కోట, ఎమ్మెస్ రెడ్డి, శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒకే కాలేజీలో చదివే మణికందన్ (కవిన్ ), సింధు (అపర్ణాదాస్) చాలాకాలంగా ప్రేమలో ఉంటారు. ఇక వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా సింధుకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే ఆ ప్రెగ్నెన్సీ ని.. అబార్షన్ చేయించుకోమని మణికందన్ సలహా ఇస్తాడు. కానీ సింధు అందుకు ఒప్పుకోదు. దాంతో పెళ్లి కాకుండానే సింధుతో పాటు ఆమెకు పుట్టబోయే బాధ్యత మణికందన్‌పై పడుతుంది. ఇక సింధు గురించి మణికందన్ పట్టించుకోకపోవడం అతడి నిర్లక్ష్యం కారణంగా సింధు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఈ క్రమంలోనే సింధుకు బాబు పుట్టగా.. ఆ పిల్లాడిని మణికందన్‌కు వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోతుంది సింధు. ఇక ఈ పిల్లాడిని అనాధ ఆశ్రంలో వదిలేసి వదిలించుకుందాం అనుకుంటాడు మణికందన్. ఈ క్రమంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? మణికందన్ నుంచి సింధు దూరంగా ఎందుకు వెళ్లిపోయింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.