William Friedkin Passes Away | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విలియం ఫ్రిడ్కిన్ మరణించాడు. ఆయన వయసు 87ఏళ్లు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విలియం సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణం పట్ల హాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ది బెస్ట్ హాలీవుడ్ దర్శకులలో విలియం ఒకడు. హర్రర్ సినిమాల ట్రెండ్ సెట్ చేసిందే ఈయన. 5 దశాబ్దాల కిందటే ది ఎగ్జారసిస్ట్ అనే హార్రర్ సినిమాతో సినీ ప్రేక్షకులను భయపెట్టిన తీరు మాటల్లో వర్ణించలేనిది. ఇప్పటికీ టాప్ 10 బెస్ట్ హర్రర్ సినిమాల్లో ది ఎగ్జారసిస్ట్ ఉంటుంది. హార్రర్ అనే కాదు థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలోనే విలియం సిద్ధ హస్తుడు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాలను రూపొందించడంలో విలియం తర్వాతే ఎవరైనా. క్రూజింగ్, బగ్, కిల్లర్ జూ వంటి థ్రిల్లర్ సినిమాలు ఆయన మేకింగ్‌కు నిదర్శనాలు. ఇక విలియం దాదాపుగా అన్ని జానర్ సినిమాలను టచ్ చేశాడు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ప్రతీ జానర్లో తన మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ది ఫ్రెంచ్ కనెక్షన్, ది ఎగ్జారసిస్ట్, ది బ్రింక్స్ జాబ్, ది గార్డియన్, జేడ్ , ది హాంటెడ్ వంటి సినిమాలు చాలా మందికి హాట్ ఫేవరైట్. ప్రస్తుతం విలియం దర్శకత్వం వహించిన ది కేయిన్ ముటినీ కోర్ట్-మార్షల్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సినిమా రిలీజ్‌కు ముందే చనిపోవడం బాధాకరం.
విలియం డ్యాక్యుమెంటరీ సినిమాలు తీయడంలో కూడా దిట్ట. నిజానికి ఆయన కెరీర్ స్టార్ట్ చేసిందే డ్యాక్యుమెంటరీ సినిమాలతో. ఆయన దర్శకత్వం వహించిన ది ఫ్రెంచ్ కనెక్షన్ సినిమాకు విలియం బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్నాడు. ఇక ది ఎగ్జారసిస్ట్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్‌ను నామినేట్ అయ్యాడు.