OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ షూటింగ్ ఎట్టకేలకి పూర్తయింది. ప్రముఖ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతుండగా, సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న, దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇప్పటివరకు కనిపించని స్టైలిష్ లుక్, మ్యానరిజమ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఇటీవలే చిత్రయూనిట్ పవన్ కళ్యాణ్‌తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా మరో ఫొటో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో పవన్, సుజీత్, తమన్ ముగ్గురూ బ్లాక్ డ్రెస్‌లో కనిపించగా, పవన్ కళ్యాణ్ అప్యాయంగా వారిపై చేతులు వేసి నవ్వుతూ కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ఫోటోకి “మిలియన్ డాలర్ పిక్చర్” అనే క్యాప్షన్ ఇచ్చింది.
ఇక ఓజీ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బీజీఎం, ట్యూన్స్ సినిమాపై మ్యూజికల్ హైప్‌ను పెంచాయి. ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ , సువ్వి సువ్వి అనే మెలోడీ సాంగ్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇక త్వరలోనే మరో బ్లాక్‌బస్టర్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించడంతో ఆ సాంగ్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక మోహన్ కన్మణి పాత్రలో కనిపించి మెప్పించనుంది. ఇక ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా ఇతర కీలక పాత్రల్లో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.