OG Sequel | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చివరి దశ పనుల్లో ఉందని సమాచారం. పవన్ మార్క్ డైలాగ్స్, పాటలు, కీలక సన్నివేశాలకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, పవన్ తదుపరి ప్రాజెక్టులపై కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రామ్ తాళ్లూరి నిర్మాణంలో మరో కొత్త సినిమాకి పవన్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే తాజాగా పవన్ లైనప్‌లో మరో సినిమా చేరే అవకాశాలపై టాలీవుడ్లో హాట్ టాక్ నడుస్తోంది.
ఆ సినిమా మరేదో కాదు.. ఓజీ సీక్వెల్. ఓజీ-2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సీక్వెల్‌కు నిర్మాత మారే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. మొదటి భాగానికి భిన్నంగా, ఓజీ-2 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. పవన్ కల్యాణ్ ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు KVN ప్రొడక్షన్స్‌తో చేయాల్సిన కమిట్మెంట్స్ ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అందుకే ఓజీ-2ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోందన్న ప్రచారం బలపడుతోంది. మరోవైపు దర్శకుడు సుజీత్ ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసినట్టు వినిపిస్తోంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓజీ కథను ఒకే సీక్వెల్‌తో ముగించకుండా, మూడో భాగం వరకూ తీసుకెళ్లాలనే ఆలోచన ఉందట. ఓజీ-2తో పాటు ఓజీ-3 కూడా కథాపరంగా లింక్ అయి ఉంటాయని, ఇదొక ఫ్రాంచైజ్‌గా మారే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓజీ-3లో కూడా పవన్ కల్యాణ్‌నే కొనసాగిస్తారా? లేక ఆ పాత్రను అకిరా నందన్‌తో కొత్తగా పరిచయం చేస్తారా? అన్న ప్రశ్నలకు ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, పవన్ లైనప్ మాత్రం అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.