Yellamma | హీరో నితిన్ ఓ వైవిధ్యమైన కథకు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ఇప్పటివరకూ లవ్, యాక్షన్ కథలతో అలరించిన నితిన్‌కు ఇది కొత్త జానర్. ఇంతకీ ఆ కథ ఏంటి? దాని పూర్వాపరాలేంటి? అనే విషయానికొస్తే.. ‘బలగం’తో ఊహకందని విజయాన్ని అందుకున్న కమెడియన్ వేణు ఎల్దెండి.. ఆ చిత్రం తెచ్చిపెట్టిన ఇమేజ్‌ని నిలబెట్టుకునేందుకు, మలి ప్రయత్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించే ప్రయోగాత్మక కథను తయారు చేసుకున్నారట. ఆ కథే ‘ఎల్లమ్మ’.
ఈ కథను నాని, శర్వానంద్‌లకు కూడా వేణు వినిపించారట. వారికి కథ నచ్చినా, అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఓకే చెప్పలేకపోయారని వినికిడి. చివరకు బంతి నితిన్ కోర్ట్లోకి వచ్చి చేరిందట. నితిన్ ఈ కథను ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారని తెలుస్తున్నది. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. దిల్‌రాజు బ్యానర్లో సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలో రానున్నదట. ఇదే నిజమైతే.. తొలి సినిమా ‘దిల్’ తర్వాత నితిన్‌తో దిల్‌రాజు చేస్తున్న సినిమా ఇదే అవుతుంది.