తెలుగులో మూడేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది బెంగళూరు సుందరి నిధి అగర్వాల్. ఆమె పవన్‌కల్యాణ్ సరసన కథానాయికగా నటించిన ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఈ సందర్భంగా గురువారం నిధి అగర్వాల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది. పవన్‌కల్యాణ్ వంటి తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోతో కలిసిన నటించడం గొప్ప అదృష్టమని, ఆయనతో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానమని చెప్పింది. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి.
తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలులైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది’ అని నిధి అగర్వాల్ పేర్కొంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథను రాశారని, ఇందులో పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుందని, అందులో అభినయించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో ‘రాజాసాబ్’లో నటిస్తున్నానని, ప్రభాస్ నిజంగా సహృదయుడని, అందరూ చెప్పినట్లుగానే అతను నిజమైన డార్లింగ్ అని ప్రశసించింది.