యువ దర్శకులను నమ్మే కథానాయకుడు నాని. ఆయన తన కెరీర్లో నాగ్ అశ్విన్, శివ నిర్వాణ వంటి కొత్త దర్శకులతో సినిమాలు చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంతలో నాని కొత్త ప్రాజెక్ట్ గురించి టాక్ బయటకొచ్చింది. తనతో గతంలో ‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని మూవీ ఉంటుందని తెలుస్తున్నది. గతంలో వీరి కలయికలో రూపొందిన ‘అంటే సుందరానికీ’ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా…నాని కెరీర్లో ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలించింది.
ఓటీటీ, టీవీ ప్రసారాల్లో మంచి ఆదరణ పొందింది. సక్సెస్ కంటే దర్శకుడి ప్రతిభను నమ్మడం తెలిసిన నాని మరోసారి వివేక్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. నాని ఖాతాలో ‘హిట్, ద థర్డ్ కేస్’ సినిమా కూడా ఉంది.