‘బాలకృష్ణగారిని కొత్తగా చూపించాలనే తపనతో అనిల్ రావిపూడి రాసుకున్న కథ ఇది. నాతో అనిల్ ఒకే మాట అన్నారు. ఫైట్స్ విషయంలో బాలయ్య గత చిత్రాలకూ దీనికీ తేడా ఉండాలి అని. అందుకు తగ్గట్టే నాచురల్‌గా ఉండేలా ప్లాన్ చేశాం’ అని చెప్పారు. ఫైట్‌మాస్టర్ వెంకట్. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ వెంకట్ విలేకరులతో మాట్లాడారు.
‘ ఇందులో బాలయ్య ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అక్కడ ఉన్నవాటితో ఓ వెపన్ తయారుచేస్తారు. ఆ వెపన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అనిల్ రావిపూడి ఆ వెపన్తో టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు యాక్షన్ సీన్స్ ఎలా ఉండాలో నాకొక అవగాహన ఉంది. ‘భగవంత్ కేసరి’కి అది ప్లస్ అయ్యింది. బాలయ్య వయసును అస్సలు లెక్కచేయరు. ఫ్యాన్స్‌కోసం రిస్కీషాట్స్ చేసేస్తారు. అందుకే ఆయన అంతమందికి అభిమానపాత్రుడయ్యాడు. ‘భగవంత్‌కేసరి’ ఫ్యాన్స్‌కి ఫుల్‌మీల్ లాంటి సినిమా’ అన్నారు వెంకట్.