Nagarjuna | తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రమశిక్షణతో వారిద్దరు తమ నటనా జీవితాన్ని సాగించారు. నేటితరం నటులకు వారు ఆదర్శం. తెలుగుభాషా పరిరక్షణకు అక్కినేని నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అక్కినేని ముఖ్య కారకుడు. ఏఎన్ఆర్ కేవలం 16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. తుదిశ్వాస వరకు కూడా సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభను చాటారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాగేశ్వరరావు , సినీ పరిశ్రమలో ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న నాగ్ ‘విక్రమ్’ సినిమాతో హీరోగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మన్మథుడు’ అనే ట్యాగ్‌తో మహిళా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వరుస విజయాలతో కింగ్ నాగ్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాగార్జున, త్వరలోనే కుబేర అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్‌లో జరగగా, ఈ కార్యక్రమంలో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఈ ఈవెంట్లో యాంకర్ సుమతో నాగార్జున చిట్‌చాట్ లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “అక్కినేని నాగేశ్వరరావు గారి వాలెట్ నుంచి డబ్బులు దొంగతనం చేశారా?” అనే ప్రశ్నకు “అవును, చేశాను!” అని నవ్వుతూ సమాధానమిచ్చారు. డబ్బు సంపాదించాలంటే ఉండకూడని లక్షణాలు ఏంటని అడిగితే, “ఆశ, బద్ధకం” అని తెలియజేశారు. ప్రస్తుత తరం యువతకు ఇచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు “ఫోన్ చూడటం తగ్గించండి” అని సమాధానం ఇచ్చారు. అయితే నాగ్ కామెంట్స్ పై నెటిజన్లు “మీరూ అందరి మాదిరిగానే తండ్రి పాకెట్లోంచి డబ్బులు తీసారా?” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే తన కొడుకులు చైతూ, అఖిల్‌లు మాత్రం తన మాదిరిగా డబ్బులు దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. అందుకు కారణం తాను పర్స్ వాడకపోయేవాడినని చెప్పుకొచ్చారు.