తెలుగు సినీ దిగ్గజం, దివంగత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతిని సోమవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రిని స్మరించుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు అగ్రహీరో నాగార్జున. తన తాజా చిత్రం ‘బంగార్రాజు’లో ఏఎన్నార్ శైలి పంచెకట్టులో అలరించబోతున్నానని చెప్పారు. ‘నాన్న నా హీరో, స్ఫూర్తిప్రదాత..ఆయనకు పంచెకట్టు అంటే ఎంతో ఇష్టం. పంచెకట్టులో ఆయన వెలిగిపోయేవారు. ముఖ్యంగా పొందూరు ఖద్దరు అంటే బాగా ఇష్టపడేవారు. ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా నేను అదే ఖద్దరును ధరిస్తున్నా. ‘దసరా బుల్లోడు’లో నాన్నగారి వస్త్రధారణను ‘బంగార్రాజు’లో పునఃసృష్టించే ప్రయత్నం చేశా. నవరత్నాల హారం, ఉంగరం ధరించడంతో పాటు నాన్నగారి ఫేవరేట్ గడియారాన్ని పెట్టుకున్నా. ఇవన్నీ వేసుకుంటే ఆయన నాతోనే ఉన్నట్లుంది. పంచెకట్టు అందాన్ని మరలా మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం’ అని నాగార్జున చెప్పారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్న ‘బంగార్రాజు’కు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. జీ స్టూడియోస్ భాగస్వామ్యంలో స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.