నచ్చిన కథలకి ఓకే చెబుతూ, నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ క్రమంలో విజయాలను, అపజయాలను సమానంగా అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇదిలావుంటే.. ‘తండేల్’ నిర్మాణంలో ఉండగానే, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చైతు. ‘విరూపాక్ష’తో వందకోట్ల విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు.
ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో మొదలుకానుంది. నాగచైతన్య, ఇతర ప్రధాన తారాగణంపై ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అలాగే, చైతూపై ఓ స్పెషల్ సాంగ్‌ని కూడా ఈ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారు దర్శకుడు కార్తీక్ దండు. ఇందులో చైతూ కొత్తగా కనిపిస్తారని, ఆయనకు కార్తీక్ దండు న్యూ మేకోవర్ ఇస్తున్నారని యూనిట్ సభ్యుల సమాచారం. పూజాహెగ్డే కథానాయికగా ఖరారైనట్టు వార్తలొస్తున్నాయి. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర(ఎస్వీసీసీ) పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.