ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పాట మార్మోగాలి అంటున్నారు సంగీత దర్శకుడు థమన్. టాలీవుడ్లో ఇప్పుడంతా థమన్ హవానే. ప్రతి భారీ చిత్రంలో సంగీత దర్శకుడిగా అతని పేరే. తనకొచ్చిన బాధ్యతగా తీసుకుంటున్నట్లు చెబుతున్నారాయన. ఈ జోరులో ఆయన స్వరపర్చిన సినిమా ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలోని కళావతి.., ఎవ్రీ పెన్నీ.., సర్కారు వారి పాట.. టైటిల్ సాంగ్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకు పనిచేసిన అనుభవాలతో పాటు కెరీర్ విశేషాలు తెలిపారు థమన్.
‘కళావతి..’ పాట విజయంపై మీ స్పందన
కథలోంచి వచ్చిన పాట ఇది. ఫస్ట్ ట్యూన్ కే ఒకే అయ్యింది. ఈ పాట లీక్ చేసినప్పుడు చెప్పరానంత బాధ కలిగింది. మా నిర్మాతలు మంచి వాళ్లు కాబట్టి లీక్ చేసిన వాడిని మందలించి వదిలేశారు. మాస్ సాంగ్స్‌కు అభిమానులు డ్యాన్సులు చేస్తారు గానీ రేపు థియేటర్లో ఈ మెలొడీకి స్టెప్పులేస్తారు.
ఎవ్రీ పెన్నీ పాటలో మహేష్ బాబు కూతురు సితారను తీసుకోవాలని ఆలోచన ఎవరిది?
నేను సితార చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటాను. ఆమె డ్యాన్సుల్లో ఒక ైస్టెల్ ఉంది. పెన్నీ లేడీస్ పాడే పాట. సితార లిరికల్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. నమ్రతను అడిగితే హీరో గారిని అడగండి అని చెప్పింది. సితార ఇన్‌స్టా రీల్స్ చూపించి ‘బాగా డ్యాన్సులు చేస్తుంది.. మన పాటకు బాగుంటుంది’ అని మహేష్‌తో చెప్పాను. ఆయన అంగీకారం తెలిపారు.
దర్శకుడు పరశురామ్‌తో పనిచేసిన అనుభవాలు చెప్పండి?
ఆయనతో నాకు ఇది మూడో సినిమా. మహేష్ ఇమేజ్‌కు తగిన మంచి పాటలు చేయడం మా ఇద్దరికీ పెద్ద టార్గెట్ అయ్యింది.
స్టార్ సినిమాకు పనిచేయడంలో ఎలాంటి ఒత్తిడి ఉంటుంది?
స్టార్ హీరో సినిమా సంగీతంపై విపరీతమైన అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడమే సవాలు. ఒక మంచి ట్యూన్ చేయడమే కాదు ఆ పాటను ప్రమోట్ చేయడం, శ్రోతల దగ్గరకు తీసుకువెళ్లడం వరకు పనిచేయాల్సి ఉంటుంది. అది మొదట్లో ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అలవాటు అయ్యింది.
లిరికల్ వీడియోలకు భారీ ఖర్చు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు?
అల వైకుంఠపురములో సినిమా తర్వాత సంగీతపు బడ్జెట్ స్వరూపం మారిపోయింది. ఒక పాట లిరికల్ వీడియోకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు, ఆడియో కంపెనీలు ముందుకొస్తున్నాయి. కళావతి పాట లిరికల్ వీడియోకు దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. పాట బాగా రీచ్ అవ్వాలనే ఖర్చు పెడుతున్నారు. అన్ని పాటలకూ ఇలా చేయలేం. ఏ పాటకు లిరికల్ వీడియో చేయాలో ముందే తెలుస్తుంటుంది.
మీరు కోరుకున్న స్థాయికి చేరుకున్నారని అనుకుంటున్నారా?
ఎంత పనిచేస్తే అంత అనుభవం వస్తుంది. నేనూ అలాగే అనుభూతిచెందుతున్నా. తెలుగు సినిమాకు మరింత మంచి సంగీతాన్ని ఇవ్వాలనేది నా కోరిక. మన పాటలు ప్రపంచమంతా మోగాలి.
సంగీతంలో మీ టైమ్ నడుస్తుందని అనుకోవచ్చా?
హీరోలు, దర్శకులు, నిర్మాతలు నా మీద పెడుతున్న నమ్మకాన్ని నిలబెట్టడమే నా బాధ్యత అని భావిస్తుంటా. అందుకు బాగా కష్టపడాలి. నన్ను నమ్మి పాటలకు భారీ ఖర్చు చేస్తున్న ఆడియో కంపెనీలు, నిర్మాతలకు ప్రతిఫలం ఇవ్వాలి. అందుకే ప్రతి సినిమాను ఒక సవాలుగా తీసుకుంటున్నా
ఈ సినిమాలో ఏ పాట స్వరపర్చడం కష్టమైంది?
సర్కారు వారి పాట టైటిల్ సాంగ్‌కు బాగా కష్టపడ్డాం. చాలా వెర్షన్స్ చేశాం. వేలం పాట పాడినట్లు ఉండాలి, అలాగే యూత్‌కు నచ్చేలా ఉండాలి. ఇవన్నీ చూసుకుని స్వరపర్చాం.
ఒకేసారి నాలుగైదు సినిమాలకు సంగీతాన్ని అందించండపై మీ స్పందన?
గతంలో అన్నీ కమర్షియల్ చిత్రాలే తెరకెక్కేవి. అన్నింట్లో దాదాపు ఒకేలా పాటలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కథకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు రూపొందుతున్నాయి. పౌరాణిక, పీరియాడిక్..ఇలా వైవిధ్యమైన నేపథ్యాలతో సినిమాలు వస్తున్నాయి. ఈ మార్పు కొత్త పాటలు చేసేందుకు మాకు స్ఫూర్తినిస్తున్నది.