Mahesh Babu | వాల్ట్ డిస్నీ రూపొందించిన ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. పలు భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ముఫాసా పాత్రకు అగ్ర హీరో మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. తెలుగు ట్రైలర్‌ను ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పడం పట్ల మహేష్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు.
తన కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఇదని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘డిస్నీ సంస్థ చిత్రాల్లోని ఎంటర్టైన్మెంట్, స్టోరీటెల్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అడవికి రారాజైన ముఫాసా పాత్రకు వాయిస్ అందించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ జీవం పోసిందని డిస్నీస్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు. ఈ చిత్రానికి బారీజెంకిన్స్ దర్శకత్వం వహించారు.