Mohanlal in Mahesh babu Movie | ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా ఇలాగే ఒక స్టైల్ ఉంది. ఈయన సినిమాలు ఎక్కువగా కుటుంబ కథల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటితోనే ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం ఆయన స్టైల్. అంతేకాదు త్రివిక్రమ్ సినిమాల్లో హీరోతో పాటు మరో బలమైన క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది హీరో తండ్రి కావచ్చు.. మామయ్య కావచ్చు.. ఇంకా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో కూడా త్రివిక్రమ్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఆ క్యారెక్టర్లో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 11 ఏండ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఈ కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ వచ్చాయి. దీంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకున్నారు. కానీ పలు కారణాలతో ఇద్దరూ కలిసి పనిచేయలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు ఇన్నేండ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల తర్వాత వరుసగా మూడోసారి పూజకు అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో తర్వాత ఒక బలమైన క్యారెక్టర్ ఉందని.. ఈ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ వీటిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. అయితే తాజాగా మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.
మోహన్‌లాల్ ఈ మధ్య తెలుగులో కూడా ఎక్కువగా నటిస్తున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలలో మోహన్ లాల్ నటించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో కూడా కీలకమైన పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఉండబోతుందని.. అందులో మోహన్ లాల్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది. ఇప్పటికే ముహూర్త కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్.. మార్చి నుంచి మొదలు కానుంది.