ఈ పోటీ ప్రపంచంలో కల్మషమెరుగని మనుషులు చాలా అరుదు. ఏపాటికీ అంతమ లక్ష్యం అందుకునేందుకు ఆరాటమే తప్ప, సాటి వారి క్షేమాన్ని కాక్షించే మనసులు ఎక్కడో కానీ ఉండవ్. కానీ.. అనారోగ్యం నుంచి బయటపడ్డ మమ్ముట్టి గురించి మలయాళ పరిశ్రమ స్పందిస్తున్న తీరు చూస్తే, బోల్డన్ని మంచి మనసులు ఇంకా ఈ భూమ్మీద ఉన్నాయనిపిస్తుంది. ఇటీవల మమ్ముట్టి ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. దాంతో మోహన్‌లాల్ శబరిమల వెళి,్ల తమ మిత్రుడు వెంటనే కోలుకోవాలంటూ అయ్యప్పను ప్రార్థించి, పూజలు జరిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అభిమానుల్లో ధైర్యాన్ని కూడా నింపారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం మమ్ముట్టి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందనేది లేటెస్ట్ న్యూస్. త్వరలో ఆయన షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్టు మలయాళ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని మోహన్‌లాల్ కూడా ప్రపంచానికి పరోక్షంగా తెలియజేశారు.
వారిద్దరి స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఓ ముచ్చటైన ఫొటోను ఆయన షేర్ చేశారు. దానికి లవ్ సింబల్‌ని కూడా జత చేసి, తామంతా ఆనందంగా ఉన్నట్టు ఓ ఎమోజీని జోడించారు. ఈ ఫొటో చూసిన వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల స్నేహబంధాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. పనిలోపనిగా మలయాళ నిర్మాతలు సైతం మమ్ముట్టి క్షేమ సమాచారాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ‘మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. నా ఆనందానికి అవధుల్లేవు. ఆయనకు ఏం కాదని నాలో ధైర్యాన్ని నింపిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ మమ్ముట్టి మేకప్‌మ్యాన్ జార్జ్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. నటి మంజు వారియర్ అయితే.. తన ఇన్‌స్టాలో మమ్ముట్టి ఫొటోను షేర్ చేసి, ‘వెల్కమ్ బ్యాక్ టైగర్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ పోస్ట్‌పై అభిమానులు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. ‘లెజెండ్స్ ఎప్పుడూ అలసిపోరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మమ్మట్టి జితిన్ దర్శకత్వంలో ‘కళంకావల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారు.