Actor Mohan Babu | ట్రోలింగ్ విషయం పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్ సినిమా చరిత్రలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, నిర్మాతగా వందల సినిమాలు చేశాడంటే మాములు విషయం కాదు. ఆయన వల్ల ఇండస్ట్రీలోకి పరిచయమైన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడంటే ఆయన సినిమాలు ఆడటం లేదు కానీ.. 80,90 దశకాల్లో ఆయన సినిమా రిలీజవుతుందే స్టార్ హీరోలు సైతం వాళ్ల సినిమాలను రిలీజ్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు. కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ నే సొంతం చేసుకున్నాడంటే అప్పట్లో ఆయన సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్లు సాధించేవో అర్థం చేసుకోవచ్చు. మోహన్ బాబు అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
అయితే గత రెండు దశాబ్దాలుగా మోహన్ బాబుకు కలిసి రావడం లేదు. నటుడిగానే, కాదు నిర్మాతగానూ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక మోహన్ బాబు నటవారసులు కూడా అదే విధంగా విఫలం అవుతూ వస్తున్నారు. మంచు విష్ణు సినిమాలు పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. ఇటీవలే రిలీజైన జిన్నా సినిమా అసలు విడుదలైన సంగతే జనాలకు తెలియదు. సన్నీలియోన్ సైతం ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇక మనోజ్ కెమెరా ముందుకు వచ్చి ఏళ్లు గడిచిపోయింది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ప్రకటించాడు. అందులో ఒకటి షూటింగ్ స్టార్ట్ చేయగా.. మరొకటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మంచు లక్ష్మీ అడపా దడపాగా సినిమాల్లో కనిపిస్తున్నా బలమైన పాత్రలు పడటం లేదు.
ఇలాంటి సమయంలో మోహన్ బాబు వంద కోట్ల సినిమాను ప్రకటించి అందరనీ షాక్ కు గురిచేశాడు. మా అధ్యక్షుడు విష్ణు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. అంతేకాదు ఈ సినిమా ప్లాట్ ను కూడా మోహన్ బాబు ముందే చెప్పేయడం విశేషం. మోహన్ బాబు యూనివర్సిటీ, అక్కడి స్టూడెంట్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు మోహన్ బాబు వెల్లడించాడు. మరీ ఈ సినిమా అయినా నటుడిగా మోహన్ బాబుకు, నిర్మాతగా విష్ణుకు కలిసి వస్తుందో లేదో చూడాలి.